-
కొత్త ప్రయత్నాల్లో జగన్
-
తోట త్రిమూర్తులకు బాధ్యతలు
-
కాపు నేతలతో భారీ విందు సభ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్యలాంటివి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. అందుకే దూరమైన వర్గాలను దరిచేసుకునే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు.
అయితే అది అంత సులువైన పని కాదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆయన వైపు బలమైన కాపు నేతలుగా ముద్రగడ పద్మనాభం వంటి వారు ఉన్నారు. కానీ వారి ద్వారా ప్రయత్నిస్తే పెద్దగా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు.
అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డి కొత్త నేతను ప్రయోగిస్తున్నారు. కీలక బాధ్యతలను గోదావరి జిల్లాల సీనియర్ కాపు నేత తోట త్రిమూర్తులకు అప్పగించారు. త్వరలో త్రిమూర్తుల ఆధ్వర్యంలో కాపునేతలకు భారీ విందు సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేయనున్నారు.
-
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపులను తనవైపు తిప్పుకునేందుకు జగన్ చేయని ప్రయత్నం ఉండదు. గతంలో చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం ద్వారా చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో కాపు రిజర్వేషన్ ఉద్యమం హింసాత్మక పరిస్థితులకు దారితీసి చంద్రబాబు పట్ల కాపుల్లో ఆగ్రహం నింపగలిగారు.
దాని ప్రభావమే 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాపులను విస్మరించడంతో 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు కాపులు లేనిదే అధికారంలోకి రానని డిసైడ్ అయ్యారు. కాపుల్లో చీలిక తెచ్చేందుకు ఇప్పుడు తోట త్రిమూర్తులను ప్రయోగించారు. మొత్తం కాపు నేతలను ఒకచోటకు చేర్చి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు.
-
మారిన వ్యూహం..
అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి కాపు రాజకీయం కోసం తోట త్రిమూర్తులను ఎంపిక చేయడం వ్యూహాత్మకమైన తెలుస్తోంది. గతంలో ముద్రగడ పద్మనాభం ద్వారా రాజకీయం చేశారు. కానీ అది ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కొత్త ముఖం ద్వారా కాపు రాజకీయాన్ని టర్న్ చేయాలని చూస్తున్నారు.
కాపుల్లో చీలిక తెస్తే అధికారం తనదేనని బలంగా నమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గంలో బలమున్న నేతలను గుర్తించే పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అంటే కచ్చితంగా కాపుల మద్దతు పొందాలి అన్న ఆలోచనతో ఉన్నారు.
-
వర్కౌట్ అనుమానమే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగే ఈ ప్రయత్నాలకు కాపులు ఎంతవరకు మద్దతు తెలుపుతారు అనేది చూడాలి. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో కాపు నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు. కానీ కాపు సామాజిక వర్గం మాత్రం విశ్వసించలేదు. దానికి కారణం ఐదేళ్ల జగన్ పాలనలో కాపులకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు.
అంతకుముందు చంద్రబాబు ఇచ్చిన ఈ బీసీ రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. చాలా రకాల పథకాలకు సైతం మంగళం పలికారు. ఇతర సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ కాపుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకే తోట త్రిమూర్తులు లాంటి నేతలు ఎన్ని సమావేశాలు నిర్వహించిన కాపులు నమ్మే స్థితిలో లేరు అని కూటమి వర్గాలు పొట్టి పారేస్తున్నాయి.
అయితే ఏదో రకంగా ప్రయత్నం చేసి కాపుల్లో చీలిక తేవాలన్న ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో అన్నది చూడాలి.