క్రైమ్ మిర్రర్ : ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు సముద్ర అలల్లో గల్లంతైన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. ఆదివారం ఉదయం పెదగంట్యాడ మండలంలోని పాత గంగవరం బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, పెద జాలారిపేటకు చెందిన నీతూ, రాము తమ స్నేహితులతో కలిసి ఫ్రెండ్షిప్ డే వేడుకలను పురస్కరించుకుని బీచ్‌కు వెళ్లారు. వారితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. సముద్ర తీరంలో కొంతసేపు గడిపిన అనంతరం ఫోటోలు దిగేందుకు సముద్రంలోని రాతిపైకి ఎక్కారు.
ఈ సమయంలో ఒక్కసారిగా భారీ అల ఎగసిపడటంతో నీతూ, రాము సముద్రంలో కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో సముద్రంలో గల్లంతైన ఇద్దరి కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదకర ప్రాంతాల్లో ఫోటోలు లేదా సెల్ఫీల కోసం సముద్రంలోని రాళ్లపైకి వెళ్లడం ప్రమాదకరమని, అలల తీవ్రతను నిర్లక్ష్యం చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. గల్లంతైన యువతి, యువకుడి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
also read : సీసీ కెమెరాలతోనే నేరాల నియంత్రణ
