Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో మొద‌లైన‌ స్థానిక ఎన్నికల సందడి...!

ఏపీలో మొద‌లైన‌ స్థానిక ఎన్నికల సందడి…!

  • సన్నాహాలు ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్

  • ముందుగా పంచాయితీలకు, తరువాత మున్సిపాలిటీలకు, చివరిగా ప్రాదేశికాలకు

  • ఆశావహుల్లో సందడి

క్రైమ్ మిర్రర్, అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభం అయింది. వీలైనంత త్వరగా పూర్తిచేసి కొత్త పాలకవర్గాలను ఎన్నుకోవాలని చూస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం. కొత్త ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన సమీక్షతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మరో మూడు నెలల కాలంలో పెండింగ్లో ఉన్న పంచాయతీ, మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతసారి వైసిపి హయాంలో ఏకపక్షంగా ఈ ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి అత్యంత పారదర్శకంగా ఎన్నికలు జరపాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.

13వేల పంచాయితీలకు…

రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటికి చివరిసారిగా 2021లో ఎన్నికలు జరిగాయి. పంచాయితీల పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఏప్రిల్ 2 తో ముగిసింది. దాదాపు అన్ని పంచాయితీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే పాలకవర్గం గడువు ముగిసిన ఆరు నెలల కాలంలోనే ఎన్నికలు నిర్వహించాలి. అందుకే ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. పంచాయితీలతోపాటు వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తయింది. ఇక మిగిలింది బీసీ రిజర్వేషన్ల అంశమే. అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్ ను నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ నివేదిక ప్రభుత్వానికి చేరనుంది. రిజర్వేషన్లు సైతం ఖరారు కానున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెప్టెంబర్ లో తొలిగా జరిగేవి పంచాయితీ ఎన్నికలేనని స్పష్టమవుతోంది.

100కు పైగా మున్సిపాలిటీలకు…

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు ఉన్నాయి. అయితే వీటి పాలకవర్గాల పదవీకాలం గడువు ఈ ఏడాది మార్చి 17 తో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వాటికి సైతం పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల నియామకం పూర్తయింది. పంచాయితీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లలో ఉంది. మరోవైపు జూన్లో జిల్లా పరిషత్తులతో పాటు మండల పరిషత్తులకు సంబంధించిన ప్రాదేశిక సభ్యుల పదవీకాలం ముగియనుంది.

దీంతో మండల పరిషత్తులతో పాటు జిల్లా పరిషత్తులకు ప్రత్యేక అధికారులు రానున్నారు. ముందుగా పంచాయితీలకు.. తర్వాత మున్సిపాలిటీలకు.. చివరిగా పరిషత్ ఎన్నికల వైపు ప్రభుత్వం మొగ్గు చూపునట్లు తెలుస్తోంది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కదలిక రావడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు