-
అనుబంధ పరిశ్రమల రాకతో లక్ష కోట్ల పెట్టుబడులు
-
ఈనెల 15న శంకుస్థాపన చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఐటీతో పాటు ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ల తర్వాత ఇప్పుడు రక్షణ రంగంలో కూడా భారీ అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. పుట్టపర్తి కేంద్రంగా డిఫెన్స్, ఏరో స్పేస్ రంగంలో దేశంలోనే కీలక హబ్ గా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ, ఫ్లైట్ టెస్టింగ్, ఏరోస్పేస్ పరిశోధనా కేంద్రం పుట్టపర్తి లో ఏర్పాటు కానుంది.
అయితే ఈ నూతన ప్రాజెక్టుపై మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 15 నా పుట్టపర్తి నుంచి ఏం టేక్ ఆఫ్ అవుతుందో ఊహించగలరా అంటూ చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది. అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు, భారీ రన్ వేలు, భవిష్యత్తు తరహా ఏరో స్పేస్ కేంద్రాలు, హైటెక్ తయారీ యూనిట్లు అందులో కనిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అది వీడియో కాదు. ఏపీ భవిష్యత్తు అందులో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు లోకేష్ అందరి అంచనాలను పెంచేశారు ఈ ప్రాజెక్టుపై.
పెద్ద ఎత్తున అనుబంధ పరిశ్రమలు…
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఈ కొత్త ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు తో పాటు అనుబంధ పరిశ్రమల ద్వారా దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయన్నది ఒక అంచనా. ఈనెల 15న సీఎం చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం హాజరుకానున్నారు. దాదాపు 140 పైగా ఎయిర్ క్రాఫ్ట్ లు ఇక్కడ తయారీ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఏఎంసీఏకు అవసరమైన సిస్టమ్స్ డిజైన్, టెస్టింగ్, మాడ్యూల్స్, అసెంబ్లింగును బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో పూర్తి చేయనున్నారు. పుట్టపర్తిలో విమాన నమూనాల తుది అసెంబ్లింగ్, అన్ గ్రౌండ్ టెస్టింగ్లను నిర్వహించనున్నారు..
భారీ స్థాయిలో ఉద్యోగాలు…
ఈ ప్రాజెక్టుతో భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి మన రాష్ట్ర యువతకు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్, శాస్త్రవేత్తల కోసం నివాస ప్రాంతాలు, ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం డిఆర్డిఓ కు 600 ఎకరాలను కేటాయించింది. ఈ కేంద్రాన్ని ఏడీఏ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించనుంది. ఏ ఎం సి ఏ అభివృద్ధి, తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టి, భారత్ ఫోర్జ్ కంపెనీల సహకారాన్ని తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రాజెక్టుకు అనుబంధంగా మరికొన్ని యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. వీటి కోసం ప్రాజెక్టుకు సమీపంలోనే మరో నాలుగు వందల ఎకరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. ఈనెల 15 అంటే శుక్రవారం కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు