-
బండి సంజయ్ కుమారుడు పరారీ అంటూ హైదరాబాదులో పోస్టర్లు
-
రాజకీయ రంగు పులుముకుంటున్న వివాదం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: బండి సంజయ్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందా? కుమారుడి వివాదానికి రాజకీయరంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారా? దానిని నేరంగా చూడడం లేదా? రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారా? బాధితురాలికి న్యాయం జరుగుతుందా? తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఈ వివాదం చుట్టూ రాజకీయ రంగు పులుముకున్నట్లు స్పష్టమవుతోంది.
ఫోక్సో కేసు నమోదు
బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై ఫోక్సో కేసు నమోదయింది. పోలీసులు ఎప్పటికీ ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాబోతుండడం వంటి పరిణామాలు జరుగుతుండగానే.. పరారీ లో ఉన్నట్లు పోస్టర్లు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి.
దీనిని ఒక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ఉద్దేశం కనిపిస్తోంది. నిందితుడి పై ఉన్న అభియోగాలను చట్టపరంగా విచారించాల్సింది పోయి.. ఇలా ప్రచారం కోసం వాడుకోవడం చూస్తుంటే కాస్త ఇబ్బందికరమే. ఇన్ని పరిణామాల నడుమ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బలమైన వాదనలు..
ఈ కేసుకు సంబంధించి భగీరథ్ తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించిన అంశాలు రాజకీయం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తున్నాయి. బాధితురాలు వయస్సు పై గతంలో ఉన్న రికార్డులను, రాష్ డ్రైవింగ్ కేసు చార్జి సీట్లను చూపిస్తూ అవి మేజర్ అని వాదనలు వినిపిస్తున్నారు. ఇవన్నీ కోర్టు పరిధిలో అంశాలైనప్పటికీ.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసును రాజకీయం చేయాలని చూడడం.. తాజాగా పోస్టర్లు వేసి ప్రచారం చేస్తుండడం గమనార్హం.
అయితే తాజా పరిణామాలతో బాధితురాలికి న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ అంశాలను జోడించి పక్కదారి పట్టిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. రాజకీయం అంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. కానీ ఒకరి కుటుంబం పై లక్ష్యంగా చేసుకొని ఈ పోస్టర్లు వేయడం సంస్కారం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ తీరు వల్ల నేరం పక్కదారి పట్టడమే కాకుండా.. బాధితురాలి ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ పోస్టర్లు వేసిన వారు ఎవరు తమ పేర్లు మాత్రం రాయలేదు. కానీ దీని వెనుక రాజకీయ వ్యూహకర్తల ఐడియా ఒకటి ఉంటుందన్నది ఒక అనుమానం.