హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: వరంగల్, కరీంనగర్, ఖమ్మంకు ఔటర్ రింగ్ రోడ్లు 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల కోసం మెగా గ్రోత్ కారిడార్లను ఏర్పాటు చేసి ఏకరీతి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాల గ్రోత్ కారిడార్లు అత్యంత కీలకమని పేర్కొంటూ, ఆయా నగరాలకు ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపాదిత గ్రోత్ కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర చర్చ జరిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కనీసం వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్ల ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అలాగే కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసే కారిడార్ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నల్గొండ నుంచి యాదగిరిగుట్ట వరకు టెంపుల్ కారిడార్ అభివృద్ధి చేయాలని, ఆదిలాబాద్,నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను అనుసంధానిస్తూ ప్రత్యేక టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అలంపూర్ జోగులాంబ ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రాంతాల అభివృద్ధికే వినియోగించాలని సూచించారు.
గ్రోత్ కారిడార్లలో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, రింగ్ రోడ్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఎస్టీపీలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని పేర్కొన్న సీఎం, విమానాశ్రయానికి అవసరమైన నీటి వనరుల ప్రణాళికలను కూడా ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానుందని వెల్లడించారు.
నగరాల్లో ఖర్చును తగ్గించేందుకు ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రభుత్వ అవసరాల కోసం లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు