దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయంనిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పాల్ఘర్ జిల్లాలోని కోరే బీచ్ దగ్గర ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను త్వరగా సిద్ధం చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అధికారులను ఆదేశించారు.
సముద్రంలో విమనాశ్రయం నిర్మాణం ఎలా?
సముద్ర విమానాశ్రయం అంటే సముద్రంలో తక్కువ లోతు ఉన్న ప్రాంతాన్ని మట్టితో పూడ్చి కొత్త భూభాగాన్ని రూపొందించి, దానిపై విమానాశ్రయాన్ని నిర్మించడం. భూభాగం పరిమితంగా ఉన్న పెద్ద నగరాల్లో పెరుగుతున్న విమాన రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా ఎయిర్ పోర్టులను నిర్మిస్తుంటారు. జపాన్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఇప్పటికే ఇలాంటి విమానాశ్రయాలు విజయవంతంగా పనిచేస్తున్నాయి.
ముంబై నగరంలో విస్తరణకు తగినంత భూమి అందుబాటులో లేకపోవడంతో, నగరానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలోని కోరే బీచ్ ను ఈ ప్రాజెక్టుకు అనువైన ప్రదేశంగా గుర్తించారు. ఈ భారీ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ.45 వేల కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో సముద్రాన్ని పూడ్చి కొత్త భూభాగం సృష్టించడానికి దాదాపు రూ.25 వేల కోట్లు ఖర్చవుతుండగా, మిగిలిన రూ.20 వేల కోట్లతో రన్ వేలు, టెర్మినళ్లు, ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
ఏడాదికి 9 కోట్ల మంది ప్రయాణికులు
ఈ విమానాశ్రయాన్ని ఏడాదికి సుమారు 9 కోట్ల మంది ప్రయాణికులు వినియోగించగల సామర్థ్యంతో అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అలాగే, దీన్ని దేశంలోనే ప్రముఖ ఎయిర్ కార్గో హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఏడాది 30 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా నిర్వహించే సదుపాయాలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. పాల్ఘర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వధావన్ పోర్టుతో ఈ విమానాశ్రయాన్ని అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వడోదర-ముంబై ఎక్స్ ప్రెస్‌వే, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్‌వే, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్, మెట్రో రైలు వంటి ప్రధాన రవాణా మార్గాలతో కూడా ఈ ఎయిర్ పోర్టును కలపనున్నారు.