Homeతెలంగాణ'బండి'ని ప్రోత్సహిస్తేనే బిజెపికి భవిత...!

‘బండి’ని ప్రోత్సహిస్తేనే బిజెపికి భవిత…!

  • ‘వలస’ వ్యూహాన్ని నమ్ముకున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు

  • తెలంగాణలో సొంతంగా అధికారంలోకి వచ్చే బలం ఆ పార్టీ సొంతం

  • మళ్లీ బండి సంజయ్ కు ఇస్తేనే జవసత్వాలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది భారతీయ జనతా పార్టీ వ్యూహం. బెంగాల్లో విజయం తర్వాత తదుపరి టార్గెట్ తెలంగాణ అని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణలో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, అంతర్గత సమీకరణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

బిజెపి హై కమాండ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి అన్నట్టు.. కుదిరితే గులాబీ నేత తన్నీరు హరీష్ రావు.. లేకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆకర్షించి తెలంగాణలో బిజెపి జెండా ఎగురవేయాలని పెద్దలు భావిస్తున్నట్లు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే క్షేత్రస్థాయిలో బిజెపి నేతలను వదిలేసి.. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిపై ఢిల్లీ అగ్రనేతలు ఎందుకు అంత నమ్మకం పెట్టుకుంటున్నారు అనేది ప్రధానంగా చర్చ. బిజెపిని అధికారంలోకి తెచ్చే సొంత నేతలు లేరా? వారిని ప్రోత్సహిస్తే తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తేలేరా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

  • కిషన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చినా..

తెలంగాణ బిజెపికి పెద్దదిక్కుగా చాలామంది సీనియర్లు ఉండేవారు. కానీ వారందరినీ కాదని కిషన్ రెడ్డికి హై కమాండ్ ఎన్నో రకాలుగా అవకాశాలు ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఆయనకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చింది బిజెపి హై కమాండ్. కానీ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలోనూ.. గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టడంలోనూ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు కిషన్ రెడ్డి.

కానీ ఆ తరువాత బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణలో బిజెపి ముఖచిత్రాన్ని మార్చారు. తన ఘటన హిందుత్వ నినాదాలు, ప్రజా సంగ్రామ యాత్రలు, దూకుడు రాజకీయ శైలితో అప్పటివరకు మూడో స్థానంలో ఉన్న భారతీయ జనతా.. అధికార గులాబీ పార్టీకి ధీటుగా తేవడంలో సక్సెస్ అయ్యారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లలో విజయం అందుకు సజీవ సాక్ష్యం.

  • బండి సంజయ్ ను మార్చడంతో..

అయితే ఉన్నట్టుండి బిజెపి హై కమాండ్ తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం.. పార్టీని దశాబ్దాల కాలం వెనక్కి నెట్టింది అన్న అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ను అకస్మాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. మళ్లీ కిషన్ రెడ్డికి పగ్గాలు అందించడం ద్వారా బిజెపి ఎదుగుదలను పెద్దలు అడ్డుకున్నారు.

అప్పటివరకు గులాబీ పార్టీ వ్యతిరేక ఓటర్లు బిజెపి వైపు వచ్చినట్టే వచ్చి కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయ్యారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ హై కమాండ్ బండి సంజయ్ ను పక్కన పెట్టడమే ప్రధాన కారణమని క్షేత్రస్థాయి కాషాయ క్యాడర్ బలంగా నమ్ముతోంది.

ముమ్మాటికి హై కమాండ్ చేసిన పని తప్పిదం అని మెజారిటీ బిజెపి క్యాడర్ నమ్ముతోంది. బండి సంజయ్ ఇలాంటి ఫైర్ బ్రాండ్ నేతలను అణచిపెట్టి… బయట నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా బిజెపి తనను తానే నియంత్రించుకుంది.

  • వలస నాయకుల పైనే ఆశలు..

అయితే గులాబీ పార్టీ నుంచి హరీష్ రావు.. కాంగ్రెస్ హై కమాండ్ ను విభేదించి రేవంత్ రెడ్డి వస్తేనే బిజెపి అధికారంలోకి రాగలదా? అంతస్థాయికి బిజెపి పడిపోయిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కళ్ళముందు బండి సంజయ్ రూపంలో ఒక పక్కా రాజకీయ ఆస్త్రం బిజెపికి ఉంది.

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు అధికం. అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ వారిని ఆకర్షించగలరు. మరోవైపు మాస్ ఇమేజ్ సైతం ఆయనకు ఉంది. హిందుత్వ సెంటిమెంట్ తో పాటు ఎంతటి అగ్రనేతులనైనా ఎదిరించే దూకుడు ఆయన సొంతం. తెలంగాణ యువతలో ఒక బలమైన ప్రత్యామ్నాయ నమ్మకాన్ని కూడా కలిగించగల శక్తి ఆయన వద్ద ఉంది.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇద్దాం అని యువతలో ఒక అభిప్రాయం కల్పించగల శక్తియుక్తులు బండి సంజయ్ వద్ద ఉన్నాయి. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే.. అవసరం అనుకుంటే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఒంటరిగానే పార్టీని అధికార తీరాలకు చేర్చగలరని తెలంగాణ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. బిజెపి తమ వలస వ్యూహాలను పక్కనపెట్టి.. స్థానిక సమర్థ నాయకత్వాన్ని గుర్తించి బాధ్యతలు కట్టబెడితే తెలంగాణలో బిజెపి అజేయమైన శక్తిగా ఎదగడం ఖాయం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు