క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హనుమకొండ జిల్లాలోని హనుమాన్ నగర్‌లో ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న పదిహేడేళ్ళ యువకుడు నిరంజన్ కుటుంబానికి ప్రముఖ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఆర్థిక సహాయం అందించారు. ఈరోజుఆయన నిరంజన్ ఇంటికి వెళ్లి నిరంజన్ ను స్వయంగా కలిసి అతని ఆరోగ్య పరిస్థితిని వివరంగా అడిగి తెలుసుకున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ తల్లిదండ్రులైన రాంగోపాల్ చారి మరియు మానసలకు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఆయన స్ఫూర్తితోనే ఈ సాయం చేస్తున్నట్లు వెల్లడించారు.
దైవ సమానుడైన పవన్ కళ్యాణ్ నిరంజన్‌ను పరామర్శించిన విషయం తన దృష్టికి వచ్చి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మనం అందరం ఇలా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ దయవల్లనే అంటూ తనకు పవన్ కళ్యాణ్ మీద భక్తిని చాటుకున్నారు. నా కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ సహాయం అందించాలని వచ్చానన్నారు . నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి పని చేయడం సంతోషంగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడనని కూడా స్పష్టం చేశారు. నిరంజన్ కుటుంబం ఈ అనుకోని సహాయంతో కొంత ఊరట పొందింది. బండ్ల గణేష్ వంటి సినీ ప్రముఖులు సామాజిక బాధ్యతను నిర్వర్తించడం ప్రజల్లో మంచి స్పందన కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ పరామర్శ తర్వాత నిరంజన్ విషయం రాజకీయాలు మరియు సినీ రంగాల్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి మంచి పనులు ఇతరులకు స్ఫూర్తినిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సంఘటన తెలంగాణలో పవన్ కళ్యాణ్ మానవతా విలువలు, సహాయ సహకారాల పట్ల ప్రజల ఆసక్తిని మరింత పెంచుతుంది. బాలుడి ఆరోగ్యం త్వరగా కుదురుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ బాటలో బండ్ల గణేష్ చేసిన సహాయానికి స్థానికులు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో బిజీగా ఉన్నా సరే నిరంజన్ పట్ల చూపించిన మానవత్వం తెలంగాణలో ఇంకా చర్చనీయాంశంగా మారింది.