Homeఅంతర్జాతీయంహర్మూజ్ జలసంధి తెరుస్తారా.. లేదా? ట్రంప్ హెచ్చరికలతో పెరిగిన ఉత్కంఠ

హర్మూజ్ జలసంధి తెరుస్తారా.. లేదా? ట్రంప్ హెచ్చరికలతో పెరిగిన ఉత్కంఠ

క్రైమ్ మిర్రర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూల దిశలో సాగుతున్నప్పటికీ, వాటిని బహిరంగంగా తిరస్కరించడం ఆశ్చర్యంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. చర్చల ప్రక్రియ నుంచి ఇరాన్ వెనక్కి తగ్గితే పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయని స్పష్టం చేశారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టబోయే అతిపెద్ద చర్యకు సిద్ధమవుతున్న సమయంలోనే ఇరాన్ తమను సంప్రదించి చర్చలకు ముందుకొచ్చిందని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై మరో 48 గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకా రాకపోకలు సజావుగా సాగేందుకు ఇరాన్, ఒమన్‌లతో చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా తెలిపింది.

మరోవైపు, అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ అంశంపై త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ఒమన్‌తో తాము నిర్వహిస్తున్న చర్చల్లో అమెరికా ఎలాంటి భాగస్వామ్యం లేదని స్పష్టం చేసింది. తమ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడుకునేలా కొత్త సముద్ర రవాణా విధానంపై చర్చలు సాగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇకపై ఏ దిశగా సాగుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
also read : రైతు కోసం లైఫ్ జాకెట్ ఇచ్చి.. ప్రాణాలు కోల్పోయిన వరదల వీరుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు