Homeక్రైమ్భార్యతో గొడవ.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి..

భార్యతో గొడవ.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి..

క్రైమ్ మిర్రర్ : నగరంలోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడిపై అత్యంత దారుణంగా దాడి చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. సమాచారం ప్రకారం, సల్మాన్ (25) అనే వ్యక్తి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్–104 సమీపంలో తన కుమారుడు అర్మాన్‌పై దాడికి పాల్పడ్డాడు. బాలుడి తలను పిల్లర్‌కు బలంగా కొట్టడంతో పాటు పైకి ఎత్తి నేలపై పడేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం బాలుడిని లారీ కిందకు నెట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు వెల్లడించారు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని చిన్నారిని రక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన అర్మాన్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, డయల్-100కు ఉదయం 7:29 గంటలకు సమాచారం ఇచ్చినప్పటికీ, పోలీసులు సుమారు 8:35 గంటలకు మాత్రమే సంఘటనా స్థలానికి చేరుకున్నారని స్థానికులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు ఘటనాస్థలం సమీపంలోనే ఉన్నప్పటికీ స్పందన ఆలస్యమైందని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.
also read : గర్భంలోనే శిశువుకు అరుదైన శస్త్రచికిత్స.. లండన్ వైద్యుల అద్భుత విజయం

తాజావార్తలు