-
గైనకాలజిస్ట్ లేక తిప్పి పంపిస్తున్న వైనం
-
ఎమర్జెన్సీ వేళ సౌకర్యాలు లేకపోతే మా పరిస్థితి ఏంటి ?ప్రజల ఆవేదన!
-
నల్గొండకు పొమ్మంటే ఎలా? అని ప్రశ్నిస్తున్న గర్భవతులు..
-
పట్టించుకోని వైద్యాధికారులు..
-
రామన్నపేట ప్రభుత్వ దవాఖానలో రోగుల అవస్థలు
రామన్న పేట, క్రైమ్ మిర్రర్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, ముఖ్యంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ దవాఖానకు వస్తే నాణ్యమైన వైద్యం అందుతుందని నమ్మి వచ్చే నిరుపేదలకు ఇక్కడ సిబ్బంది అలసత్వమే ఎదురవుతోంది. బుధవారం, శనివారాల్లో పరీక్షల కోసం వస్తున్న గర్భిణులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.ఆసుపత్రికి రావాల్సిన సమయానికి డాక్టర్లు రాకపోవడంతో దూరప్రాంతాల నుండి వచ్చిన గర్భిణులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.
Also Read:జంతర్ మంతర్ దాడికి కుట్ర- పంజాబ్ లో రెండు ఉగ్ర మాడ్యూళ్ల గుట్టు రట్టు… 9 మంది అరెస్ట్
ఆలస్యం గురించి ప్రశ్నిస్తే సమయపాలన పాటించని సిబ్బంది గర్భిణులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెనక్కి తిప్పి పంపిస్తుండటం విచారకరం.వారం రోజుల క్రితం అర్ధరాత్రి వేళ అత్యవసర పరిస్థితిలో ఐదారుగురు గర్భిణులు ఆసుపత్రికి వెళ్తే, అక్కడ ఉన్న సిబ్బంది కనీస మానవత్వం లేకుండా వారిపై తీవ్రస్థాయిలో దురుసుగా ప్రవర్తించారు. ఎమర్జెన్సీ వైద్యం అందించాల్సింది పోయి, రాత్రి వేళ వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు తిప్పి పంపించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆసుపత్రిలో స్కానింగ్ చేసే సిబ్బంది బదిలీ కావడం, పూర్తిస్థాయి గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో సేవలు పూర్తిగా స్తంభించాయి.
Also Read:కమ్యూనిజంపై శోభిత కామెంట్స్…… నెటిజన్లలో మిశ్రమ స్పందనలు
ప్రసవ సమయం దగ్గరపడిన వారికి ఆపరేషన్లు చేసే వైద్యులు లేరనే సాకుతో చివరి నిమిషంలో నల్గొండకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో రామన్నపేట దవాఖానకు వస్తే, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో వైద్య సేవలు అందాల్సిన చోట సిబ్బంది నిర్లక్ష్యం తాండవిస్తోంది. కనీస వసతులు కల్పించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే రామన్నపేట దవాఖానను సందర్శించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకొని, పూర్తిస్థాయి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
