Homeక్రైమ్గుజరాత్‌లో చండీపుర వైరస్ కలకలం.. 22 మంది చిన్నారుల మృతి

గుజరాత్‌లో చండీపుర వైరస్ కలకలం.. 22 మంది చిన్నారుల మృతి

క్రైమ్ మిర్రర్ : గుజరాత్‌లో చండీపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మరో ఏడుగురు చిన్నారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రఫుల్ పన్సేరియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు నమోదైన 184 అనుమానిత కేసుల్లో 35 మందికి చండీపుర వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మరో 11 నమూనాల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వైరస్ బారినపడిన చిన్నారులకు గాంధీనగర్, సబర్కాంత-హిమ్మత్‌నగర్, పటాన్, రాజ్‌కోట్, భావ్‌నగర్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆరుగురు పిల్లలు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు.

వైరస్ నిర్ధారణ అయిన వారంతా 15 ఏళ్లలోపు పిల్లలేనని మంత్రి తెలిపారు. కేసులు ఒకే గ్రామం లేదా జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు పెద్ద ఎత్తున పురుగుమందుల పిచికారీ నిర్వహిస్తున్నారు. ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని, పిల్లల్లో జ్వరం, వాంతులు, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

చండీపుర వైరస్ అంటే ఏమిటి?

చండీపుర వైరస్ ఒక అరుదైన వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా ఇసుక ఈగల (Sand Flies) ద్వారా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ మెదడులో వాపు (ఎన్సెఫలైటిస్) కలిగించే ప్రమాదం ఉంది. 1965లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా చండీపుర గ్రామంలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్ ఎక్కువగా 15 ఏళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే పరిస్థితి వేగంగా విషమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వైరస్‌కు ప్రత్యేక టీకా లేదా నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
also read : అక్కను వేధిస్తున్నాడనే కక్షతో బావ హత్య.. ఐదుగురు బావమరుదులు అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు