క్రైమ్ మిర్రర్ : ద్విచక్రవాహనం అదుపుతప్పి గోడను బలంగా ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన గండిపేటలో చోటుచేసుకుంది. నార్సింగి ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రాంతానికి చెందిన బొంకు చిన్న అబ్బాయి కుటుంబం ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం గండిపేటకు వలస వచ్చింది. ఆయన తన భార్యతో కలిసి కోకాపేటలోని లెజెండ్ కిమ్స్ విలేజ్‌లో ఇళ్లలో పనిచేస్తున్నారు. వారి చిన్న కుమారుడు బొంకు అజయ్ (20) డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో అజయ్ ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడు. తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్‌లో చెప్పాడు. అయితే చాలాసేపు గడిచినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పలుమార్లు ఫోన్ చేసినా అజయ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇంతలో గుర్తుతెలియని వ్యక్తి అజయ్ ఫోన్‌ను తీసి రోడ్డు ప్రమాదంలో అతను మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన వారు గండిపేట ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలోని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ గోడ సమీపంలో తీవ్ర తలగాయాలతో అజయ్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. శంకర్‌పల్లి రోడ్డు నుంచి గండిపేట వైపు ఏపీ 40 ఎఫ్ఏ 1938 నంబర్ గల బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న షేక్ నబీ రసూల్‌కు కుడి కాలు, చేతికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
also read : రూ.లక్ష లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డీవైఎస్‌వో!
