-
కర్ణాటకలో పెరుగుతున్న ప్రాంతీయ అభిమానం
-
ఆందోళనలో పారిశ్రామిక వర్గాలు
-
అమరావతికి అరుదైన ఛాన్స్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కర్ణాటక రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరు ఏపీకి వరంగా మారింది. భారతదేశానికి సిలికాన్ వ్యాలీగా, ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా వెలుగొందుతున్న బెంగళూరు మహానగరం.. ఇప్పుడు సంకుచిత భాషా దురాభిమానం, ప్రాంతీయ విద్వేషాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఇటీవల కర్ణాటక రక్షణ వేదిక పేరుతో కొందరు తీవ్రవాద భావజాలం కలిగిన కార్యకర్తలు.. రాష్ట్ర జెండాలతో ఐటీ కంపెనీల క్యాంపస్‌లోకి జొరబడి గందరగోళం సృష్టిస్తున్నారు. ఇది పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన కలిగించే విషయం. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే బహుళ జాతి కంపెనీల కార్యాలయాల్లోకి.. అక్రమంగా ప్రవేశించి.. మీ సంస్థలో ఎంతమంది స్థానిక కన్నడిగులు ఉన్నారు? రిక్రూట్మెంట్ డేటా బయట పెట్టండి అంటూ బెదిరింపులకు దిగడం చట్ట విరుద్ధం మాత్రమే కాదు.. నాగరిక సమాజం సిగ్గుపడే చర్య కూడా.
దిగ్గజాల ఆందోళన…
బెంగళూరులో జరుగుతున్న ఈ అరాచక వైఖరిపై ఇన్ఫోసిస్ మాజీ సి ఎఫ్ ఓ టీవీ మోహన్ దాస్ పాయ్ వంటి దిగ్గజాలు గళం ఎత్తితే.. వారిపై వ్యక్తిగత దాడులు, విమర్శలకు దిగడం అక్కడి తీవ్ర పరిస్థితులకు నిదర్శనం. భాషను గౌరవించడం సరైనదే కానీ.. హింస, ఆఫీసులపై దౌర్జన్యాలు చట్టబద్ధమైన పాలన వైఫల్యానికి నిదర్శనం అని మోహన్ దాస్ పాయ్ ఖండించారు. ఆందోళనకారులు ఆయనను బెంగళూరు వనరులను అనుభవిస్తూ.. స్థానికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ టార్గెట్ చేస్తున్నారు. మెరిట్, గ్లోబల్ కాంపిటేటివ్ నెస్ ప్రాతిపదికన పనిచేసే హైటెక్ రంగంలో.. ఇలాంటి బలవంతపు ఆడిటింగ్లు, బెదిరింపులు కొనసాగితే.. అక్కడ కార్యకలాపాలు నిర్వహించడం అసాధ్యమని.. ఇతర ప్రశాంత రాష్ట్రాలకు లేదా దేశాలకు తరలిపోక తప్పదని ఇప్పటికే పలు టేక్ కంపెనీల ప్రతినిధులు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇప్పటికే సంక్షోభం…
బెంగళూరు నగరంలో అస్తవ్యస్తమైన ట్రాఫిక్ జామ్ లు, తీవ్రమైన తాగునీటి ఎద్దడి, వర్షం పడితే నీట మునిగే రోడ్లు వంటి మౌలిక సదుపాయాల సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జీవన నాణ్యత గణనీయంగా పడిపోవడంతో నగరంలోని టెక్కీలు, కంపెనీలు విసిగిపోయి ఉన్నాయి. ఇలాంటి సమయంలో నగరానికి ప్రాణవాయువైన ఐటీ రంగానికి రక్షణ కల్పించాల్సింది పోయి.. ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం సాగదీత ధోరణి అవలంబించడం, కన్నడ వేదికల అరాచకాలను ఉదాసీనంగా వదిలేయడం పరిస్థితిని మరింత విషమింప చేస్తోంది. శాంతిభద్రతల లోపం, ఉద్యోగుల భద్రతకు గ్యారెంటీ లేని వాతావరణం నెలకొంటే అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు.. బెంగళూరును విడిచి పెట్టడానికి ఏమాత్రం వెనుకడుగు వేయవు.
తెలుగు రాష్ట్రాలకు వరం…
కర్ణాటకలో జరుగుతున్న ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాలకు ఒక వరంగా మారాయి.. చారిత్రాత్మక సువర్ణ అవకాశంగా వచ్చి పడ్డాయి. ముఖ్యంగా కొత్తగా రూపుదిద్దుకుంటున్న అమరావతికి ఇది అరుదైన చాన్స్ గానే చెప్పవచ్చు. హైదరాబాద్ ఇప్పటికే మెరుగైన మౌలిక వసతులు, కాస్మోపాలిటన్ వాతావరణం, సురక్షితమైన శాంతి భద్రతలతో ప్రపంచ స్థాయి పోటీనిస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. అమరావతి రాజధాని లో భారీ గ్రీన్ ఫీల్డ్ ఐటి పార్కులు, రాయితీలు, సులభతర వాణిజ్య విధానాలతో టెక్ సంస్థలను ఆహ్వానించేందుకు ఇది సరైన సమయం.
ఇవి కూడ చదవండి:
-
రాప్తాడు కాల్పుల ఘటనపై హైకోర్టులో పిటిషన్.. పోలీసుల చర్యలపై విచారణకు డిమాండ్!
-
కొబ్బరి బోండాల మాటున పశువుల అక్రమ రవాణా.. మహబూబాబాద్‌లో 8 మూగజీవాలకు విముక్తి!
-
ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్‌కు భారీ మోసం.. రూ.69 లక్షలు కాజేసిన వ్యాపారి!
-
బీజేపీ నేత కుమారుడు మృతి.. భార్యపై సంచలన ఆరోపణలు!
