ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన ఘటనకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిపై పోలీసులు జరిపిన కాల్పుల వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్టు దృష్టికి వెళ్లింది. పోలీసుల చర్యలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
ఈ ఘటనలో నిందితుడిని ఆస్పత్రికి తరలించిన విధానం, అతడిపై పోలీసులు జరిపిన ఆరు రౌండ్ల కాల్పుల వెనుక ఉన్న పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. ముఖ్యంగా తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో అనుసరించిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అంతేకాకుండా నిందితుడి ముఖంపై కనిపించిన గాయాలు, అతడిని ఆస్పత్రికి ఈడ్చుకెళ్లినట్లు ఆరోపణలు రావడం వంటి అంశాలు పలు సందేహాలకు తావిస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. పోలీసుల చర్యల వెనుక వాస్తవ పరిస్థితులు ఏమిటో తేల్చేందుకు వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
కాల్పులు జరపాల్సిన పరిస్థితులు నిజంగా ఉన్నాయా? నిందితుడిని తరలించిన తీరులో నిబంధనలు పాటించారా? అనే అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోరారు.
రాప్తాడు ఘటన ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం తదుపరి ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
also read: కొబ్బరి బోండాల మాటున పశువుల అక్రమ రవాణా.. మహబూబాబాద్‌లో 8 మూగజీవాలకు విముక్తి!
