జార్ఖండ్‌లో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే ఓ మహిళపై అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసు శాఖలోని 15 మందిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
జార్ఖండ్‌లోని సరాయికేలా ఖర్సావన్ జిల్లాలో గమ్హరియా పోలీస్ స్టేషన్లో ఈ దారుణం చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడిన ఓ మహిళ తనకు రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే అక్కడే వైర్లెస్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న నీరజ్ లక్రా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయం బయటకు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 15 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. మరోవైపు, అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరజ్ లక్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు సిబ్బందిపై కూడా చర్యలు తీసుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ సాహు, కానిస్టేబుల్ సంతోష్ కుమార్ రాయ్‌లను అరెస్ట్ చేశారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై పోలీసు శాఖ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.
also read: రాప్తాడు కాల్పుల ఘటనపై హైకోర్టులో పిటిషన్.. పోలీసుల చర్యలపై విచారణకు డిమాండ్!
