ఆసియా క్రీడల్లో దేశానికి స్వర్ణ పతకం అందించిన అథ్లెట్ సరితా గైక్వాడ్ ఓ ఆర్థిక మోసానికి గురయ్యారు. ఇసుక వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించిన ఓ వ్యాపారి ఆమె నుంచి ఏకంగా రూ.69.10 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని తాపీ జిల్లాకు చెందిన నితిన్ భారతి అనే వ్యాపారి ఈ మోసానికి పాల్పడినట్లు సమాచారం. ఇసుక వ్యాపారంలో పెట్టుబడి పెడితే ప్రతి నెలా 4 శాతం చొప్పున లాభాలు చెల్లిస్తానని సరితా గైక్వాడ్‌కు ఆశ చూపించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె విడతలవారీగా మొత్తం రూ.69.10 లక్షలు అందించినట్లు తెలుస్తోంది.
అయితే ఒప్పందం ప్రకారం డబ్బులు తిరిగి చెల్లించాల్సిన గడువు ముగిసినా నితిన్ భారతి స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. పెట్టుబడిగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై గుజరాత్‌లోని అహ్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నితిన్ భారతిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. క్రీడల్లో దేశానికి కీర్తి తీసుకొచ్చిన ఓ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌నే భారీ మొత్తంలో మోసం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
also read: బీజేపీ నేత కుమారుడు మృతి.. భార్యపై సంచలన ఆరోపణలు!
