క్రైమ్ మిర్రర్ ; కరీంనగర్ నగరంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కాలేజీ బస్సు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం గురువారం సాయంత్రం సుమారు 5:45 గంటల సమయంలో సుభాష్‌నగర్ రోడ్ నంబర్-1లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన రంగుల వినయ్ (21), తండ్రి అనిల్, విద్యనభ్యసిస్తున్నాడు. గురువారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో అదే మార్గంలో వచ్చిన ఓ కాలేజీ బస్సు ప్రమాదానికి కారణమైంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వినయ్ ప్రయాణిస్తున్న బైక్‌ను పక్కవైపు బలంగా ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ఘటనలో వినయ్ బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. యువకుడి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడంతో పాటు అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చేతికందిన వయసులో యువకుడు మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
also read : బిచ్కుందలో దారుణం.. కొడుకు హత్య కేసులో తల్లిదండ్రులపై కేసు
