క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తగా వివాహమైన దంపతుల మధ్య జరిగిన గొడవ అనంతరం భర్త విషం తాగగా, అదే సమయంలో భార్య ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, అదనపు కట్నం కోసం అత్తింటి కుటుంబం వేధించి హత్య చేసి ఉండవచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాన్సీ జిల్లా బాబినా ప్రాంతానికి చెందిన సాగర్ సాహు, రాధ పరిచయం ఏర్పడి ఇరు కుటుంబాల అంగీకారంతో 2025 నవంబర్ 25న ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం జరిగి దాదాపు ఏడు నెలల తర్వాత ఇటీవలే ఈ దంపతులు మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ నుంచి తిరిగి వచ్చారు.
ఆగస్టు 3వ తేదీ రాత్రి ఇంట్లో సాగర్, రాధ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం సాగర్ విషపదార్థం సేవించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని బబినా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఝాన్సీకి తరలించగా, ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా, సాగర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో రాధ ఇంట్లోనే ఉంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకోగా, సీలింగ్‌కు ఉరివేసుకున్న స్థితిలో ఆమె కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
వివాహం జరిగి ఏడు నెలలు కూడా పూర్తికాకపోవడంతో ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు అధికారులు ఆదేశించారు. మరోవైపు రాధ కుటుంబ సభ్యులు అత్తింటి వారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అదనపు కట్నంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసి వేధించారని, కట్నం కోసమే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, మేజిస్ట్రేట్ విచారణ పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
also read : ట్రైనీ ఐపీఎస్ కేసులో కీలక మలుపు.. రెండు రోజుల కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి
