క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అవంతి శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంతవరకు ఆయన ఏ పార్టీలో చేరలేదు. తెలుగుదేశంలో చేరుతారని అంతా భావించారు. కానీ ఆ పార్టీ నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ పరిస్థితుల్లో అవంతి శ్రీనివాసరావు తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ గూటికి చేరిపోతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే తాజాగా ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
చేరికల కమిటీ సుముఖత..
ఇటీవల జనసేనలో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 14 మంది నాయకులతో భారీ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నుంచి జనసేనలోకి చేరికలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖంగా అవంతి శ్రీనివాస్ రావు పేరు వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అవంతి శ్రీనివాసరావుకు ఆర్థిక బలం ఉంది. ఆపై అంగ బలం కూడా ఉంది. టిడిపిలో పనిచేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. అందుకే ఇప్పుడు జనసేన ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
పిఆర్పి ద్వారా పొలిటికల్ ఎంట్రీ..
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. ఆయన అవంతి విద్యాసంస్థల అధినేత. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేరారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైసీపీకి రాజీనామా చేశారు. టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి ఆయన జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.