అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం దేశ ప్రజలు దాదాపు 500 ఏళ్లుగా ఎదురుచూశారని, ఇప్పుడు ఆలయ విరాళాలపై వస్తున్న ఆరోపణల విషయంలో నిజాలు బయటపడేందుకు మరో 15 రోజులు కూడా వేచి ఉండలేరా అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన రామజన్మభూమి తీర్థ ట్రస్టు అధ్యక్షుడు నృత్యగోపాల్ దాస్ 88వ జయంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య ప్రతిష్ఠను దెబ్బతీయకండి!
రామాలయానికి వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోందని యోగి తెలిపారు. విచారణ పూర్తికాకముందే ఎలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సిట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, అసలు నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు ఎవరి వద్దైనా ఉంటే వాటిని సిట్‌కు అందించాలని సీఎం యోగి సూచించారు. అయోధ్య ప్రతిష్ఠను దెబ్బతీసేలా, రామజన్మభూమి తీర్థ ట్రస్టుపై ప్రజల్లో అనుమానాలు కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని కూడా ఆరోపించారు.
నృపేంద్ర మిశ్రా షాకింగ్ కామెంట్స్
ఇటీవల రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆలయ నిర్వహణ వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విరాళాల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలు పరిపాలనలో ఉన్న బలహీనతలను బయటపెట్టాయని అన్నారు. ప్రస్తుతం ఆలయంలో ఎక్కువ సేవలు వలంటీర్ల ద్వారానే జరుగుతున్నాయని, దీంతో జవాబుదారీతనం తగ్గుతోందన్నారు. అనుభవం ఉన్న వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని సూచించారు. అయితే, ఈ వ్యాఖ్యలను యోగి ఆదిత్యనాథ్ తప్పుబట్టారు. సిట్ విచారణ పూర్తయ్యే వరకు అందరూ ఓపికగా ఉండాలని ఆయన కోరారు.