HomeజాతీయంNEET UG 2026 Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్‌కు సర్వం సిద్ధం.. విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక సూచనలు!

NEET UG 2026 Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్‌కు సర్వం సిద్ధం.. విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక సూచనలు!

నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీఅన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమయం కల్పించి సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు.

హాజరుకానున్న 22.79 లక్షల మంది విద్యార్థులు

ఈ ఏడాది దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో కలిపి 22.79 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు నమోదు చేసుకున్నారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్‌టీఏ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. పర్యవేక్షణ కోసం వందలాది సిటీ కోఆర్డినేటర్లు, వేలాది అబ్జర్వర్లను నియమించింది. మొత్తం రెండు లక్షల మందికిపైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

ప్రశ్నపత్రాలను జీపీఎస్ సదుపాయం ఉన్న వాహనాల్లో పోలీసు భద్రత మధ్య తరలించనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కేంద్ర కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తారు. అభ్యర్థులను బయోమెట్రిక్, మెటల్ డిటెక్టర్ తనిఖీల తర్వాతే పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ సమయంలో సాంకేతిక సమస్యలు వచ్చినా, మాన్యువల్ ధృవీకరణ ద్వారా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్‌టీఏ తెలిపింది.

విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక సూచనలు

విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. సంప్రదాయ, పూర్తి చేతుల దుస్తులు ధరించే వారు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు ప్రింట్, ఒరిజినల్ ఫొటో ఐడీ, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను వెంట తీసుకురావాలి. ఎండల కారణంగా వాటర్ బాటిల్‌ను అనుమతించారు. డయాబెటిస్ ఉన్న విద్యార్థులు షుగర్ ట్యాబ్లెట్లు, అరటిపండ్లు, యాపిల్,ఆరెంజ్ లను తీసుకెళ్లవచ్చు. విద్యార్థుల కోసం ఎన్‌టీఏ అధికారిక వాట్సప్ నంబర్ 91 78279 80287ను ప్రకటించింది. బ్లూ టిక్ ఉన్న ఈ ఖాతా నుంచే అధికారిక సమాచారం పంపబడుతుంది. బ్లూ టిక్ లేని సందేశాలను నమ్మవద్దని హెచ్చరించింది. తెలంగాణలో 199 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, రాష్ట్రం నుంచి 73,024 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు నమోదు చేసుకున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు