రెగ్యులర్ గా తప్పకుండా యోగా చేయడం వల్ల పురుషుల్లో వంధ్యత్వ సమస్యలు తగ్గే అవకాశం ఉందని, వీర్యకణాల నాణ్యత కూడా మెరుగుపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనను ఢిల్లీలోని ఎయిమ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. యోగా చేయడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గడమే కాకుండా, వీర్యకణాల్లో డీఎన్‌ఏ దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుందని గుర్తించారు. దీంతో పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
యోగా దినోత్సవం సందర్భంగా పరిశోధన ఫలితాలు వెల్లడి!
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ అధ్యయన ఫలితాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ప్రచురించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పురుషులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో యోగా ఒక సహజమైన పరిష్కారంగా ఉపయోగపడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ అధ్యయనంలో 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న 78 మంది పురుషులు పాల్గొన్నారు. వీరంతా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నవారే. వారిలో 42 మందికి ప్రత్యేక యోగా శిక్షణ ఇచ్చారు. వారు రోజుకు ఒక గంట చొప్పున, వారానికి ఐదు రోజుల పాటు 12 వారాలు యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం, విశ్రాంతి పద్ధతులను అనుసరించారు.
యోగాతో వీర్యకణాల చురుకుదనం పెరిగినట్లు గుర్తింపు
అధ్యయనం ముగిసిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించగా, వీర్యకణాల సంఖ్య, నాణ్యత, చురుకుదనం వంటి ముఖ్యమైన అంశాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. అలాగే ఒత్తిడి తగ్గడం, శారీరక-మానసిక ఆరోగ్యం మెరుగుపడడం కూడా గుర్తించారు. పురుషుల సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడడంలో యోగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఈ పరిశోధన మరోసారి స్పష్టం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామంతో పాటు యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.