ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో ఓ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోంది. తమ కుటుంబంలో ఒకరిగా భావించే ‘లడ్డూ’ను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని ఆ కుటుంబ సభ్యులు నగరమంతా వెతుకుతున్నారు. చిలుక ఆచూకీ తెలిపిన వారికి ఏకంగా రూ.లక్ష నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు.
గుజరాత్లోని వడోదరకు చెందిన పారిఖ్ కుటుంబం ఈ చిలుక కోసం అన్వేషణ సాగిస్తోంది. నాలుగు నెలల క్రితం పుణె నుంచి ఆరు నెలల వయసున్న ఆఫ్రికన్ గ్రే జాతి చిలుకను తీసుకొచ్చారు. దానికి ప్రేమగా ‘లడ్డూ’ అని పేరు పెట్టి సొంత కుటుంబ సభ్యుడిలా పెంచుకుంటున్నారు. అయితే అక్టోబర్ 31న సాయంత్రం 7 గంటల సమయంలో అనూహ్యంగా పంజరం తలుపు తెరుచుకోవడంతో లడ్డూ బయటకు ఎగిరిపోయింది. అప్పటి నుంచి దాని జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
లడ్డూ కనిపించకపోవడంపై జెస్సికా పారిఖ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమకు అది కేవలం పెంపుడు పక్షి మాత్రమే కాదని, తమ జీవితంలో ఒక భాగమని చెబుతున్నారు. ఇప్పటివరకు సొంతంగా ఆహారం తీసుకోవడం కూడా అలవాటు లేదని, ప్రతిరోజూ తానే తినిపించేదానినని తెలిపారు. ఇన్ని రోజులుగా ఆహారం లేకుండా ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.
చిలుక కోసం సేవాసి, గోత్రి, భాయ్లీ ప్రాంతాలతో పాటు వడోదరలోని పలు ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. లౌడ్స్పీకర్ల ద్వారా తమ గొంతును వినిపిస్తూ వెతికే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
లడ్డూను గుర్తించడం ఎలా?
ఆఫ్రికన్ గ్రే జాతికి చెందిన ఈ చిలుకను కొన్ని ప్రత్యేక గుర్తుల ద్వారా గుర్తించవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాని కాలికి లైసెన్స్ నంబర్ ఉన్న రింగ్ ఉంటుంది. ముక్కుపై చిన్న గీత, కంటి సమీపంలో సూదిమొనంత గాయం కూడా ఉన్నాయి. ఎవరైనా ఈ చిలుకను గుర్తిస్తే వీడియో కాల్ ద్వారా చూపించాలని జెస్సికా కోరుతున్నారు.
కొత్త వ్యక్తులను చూసినప్పుడు లడ్డూ భయంతో మౌనంగా ఉంటుందని, పేరు పెట్టి పిలిచినా స్పందించకపోవచ్చని తెలిపారు. అయితే ఈల వేస్తే మాత్రం తప్పకుండా స్పందిస్తుందని వివరించారు.
తమ లడ్డూను సురక్షితంగా తిరిగి ఇంటికి చేర్చడంలో వడోదర నగరవాసులు సహకరించాలని పారిఖ్ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. చిలుక ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి అందిస్తామని ప్రకటించింది. తమ ఇంట్లో మళ్లీ లడ్డూ కిలకిలలు వినిపించే రోజు కోసం ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది.
also read: పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్వోటీ దాడులు.. 100 లీటర్ల పాలు స్వాధీనం!
