విజయనగరం జిల్లాలోని కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న సుమారు 44 మంది విద్యార్థినులు ఒకేసారి అనారోగ్యానికి గురికావడం కలకలం రేపుతోంది. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో వారిని మాదిలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం.
అయితే ఇంతమంది విద్యార్థినులు ఒకేసారి అస్వస్థతకు గురైనప్పటికీ.. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
గత ఏడాది ఇదే గురుకుల పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మరువకముందే తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. గత అనుభవం ఉన్నప్పటికీ విద్యార్థినుల ఆరోగ్య సమస్యలపై పారదర్శకంగా వ్యవహరించలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై సరైన సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విద్యార్థినులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారు? దీనికి కారణం ఏమిటి? పాఠశాలలో ఆహారం, తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ఒకేసారి ఇంతమంది విద్యార్థినులు అనారోగ్యానికి గురైన ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
also read: బ్యాంకాక్ నుంచి పుణెకు డ్రగ్స్ స్మగ్లింగ్.. రూ.3.72 కోట్ల విలువైన గంజాయి పట్టివేత!
