Homeక్రైమ్బెంగళూరులో ఘోర మారణకాండ.. భార్యతో సహా అత్తింటి కుటుంబానికి చెందిన ఏడుగురిని చంపిన క్యాబ్ డ్రైవర్!

బెంగళూరులో ఘోర మారణకాండ.. భార్యతో సహా అత్తింటి కుటుంబానికి చెందిన ఏడుగురిని చంపిన క్యాబ్ డ్రైవర్!

కుటుంబ కలహాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. భార్యతో తరచూ గొడవలు పడుతున్న ఓ వ్యక్తి.. ఆమె కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకుని ఏడుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు ఇందుశేఖర్‌ను రాజాజీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. భార్యతో పాటు అత్త, ఇద్దరు బావమరుదులు, వారి భార్యలు, ఏడేళ్ల బాలుడిని కూడా హతమార్చినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఇందుశేఖర్‌కు సునీతతో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే సునీత తన పుట్టింటి వారితో సన్నిహితంగా ఉండటం అతడికి నచ్చేది కాదు. ఈ అంశంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సునీతకు ఆమె తల్లి, సోదరులు మద్దతుగా నిలుస్తుండటంతో వారిపై కూడా ఇందుశేఖర్ కక్ష పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులందరినీ హతమార్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు అనుమానిస్తున్నారు.

మొదట తన ఇంట్లోనే భార్య సునీతను రోకలిబండతో కొట్టి చంపినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. అనంతరం ఆమె స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మద్యం తాగుదామని చెప్పి బావమరుదులు శివకుమార్, శంకర్‌లను ఇంటికి పిలిపించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి భార్యలు దివ్య, నళినితో పాటు అత్త రూపావతి, ఏడేళ్ల బాలుడు పునీత్‌ను కూడా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు.

నళిని కనిపించకపోవడంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు ఇందుశేఖర్‌ను ప్రశ్నించారు. అతడు చెబుతున్న సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అనుమానం పెరిగింది. అతడి ఇంట్లో లభించిన ఆధారాలను పరిశీలించి మరింత లోతుగా విచారించడంతో వరుస హత్యల విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మృతదేహాలను నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు ప్రదేశాల్లో పడేసినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. గురువారం సుమారు నాలుగు గంటలపాటు వెతికిన అనంతరం చిక్‌బళ్లాపూర్ జిల్లాలో ఏడేళ్ల పునీత్ మృతదేహాన్ని గుర్తించారు. మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.

హత్యలకు ఉపయోగించిన రోకలిబండను కడిగివేసినట్లు, ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను తరలించేందుకు వినియోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ‘తానా వరది’ పేరుతో ఓ పత్రికను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా భాష్యం సర్కిల్ సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఇంటి యజమానితో నిందితుడికి ఉన్న వివాదం కూడా ఈ కేసులో మరో కోణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. వెస్ట్ డివిజన్ జాయింట్ కమిషనర్ వంశీకృష్ణ, నార్త్ డివిజన్ డీసీపీ నేమగౌడ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.

also read: చాలా రోజుల తర్వాత జంటగా అభిషేక్‌ – ఐశ్వర్య.. దీపావళి వేడుకలో సందడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు