ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీకృష్ణుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కోర్టులో ఆయనపై క్రిమినల్ పరువునష్టం పిటిషన్ దాఖలైంది.
ఆగ్రాకు చెందిన న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ మేరకు సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఇటీవల మధ్యప్రదేశ్లోని శివపురిలో నిర్వహించిన రామకథ కార్యక్రమంలో ధీరేంద్ర శాస్త్రి శ్రీకృష్ణుడి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తన పిటిషన్లో ఆరోపించారు. శ్రీకృష్ణుడిని మోసగాడిగా అభివర్ణించడంతో పాటు, ఆయన నిలబడే విధానంపై కూడా వివాదాస్పదంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కోట్లాది మంది కృష్ణ భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని న్యాయవాది తన ఫిర్యాదులో వెల్లడించారు.
అంతేకాకుండా, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి శారీరక భంగిమలను పోలుస్తూ ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలు చేసినట్లు పిటిషన్లో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
ఇదే ప్రసంగంలో శ్రీకృష్ణుడి వంశానికి సంబంధించిన అంశాలను కూడా ధీరేంద్ర శాస్త్రి ప్రస్తావించారు. ద్వాపరయుగంలో మానవ రూపంలో జన్మించిన శ్రీకృష్ణుడి వారసులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. జాదూన్, జడేజా, భట్టి వంశాలు శ్రీకృష్ణుడి వారసులని, తన తండ్రి వైపు నుంచి తాను కూడా ఆ వంశానికి చెందినవాడినని చెప్పినట్లు సమాచారం.
ఈ పిటిషన్ను పరిశీలించిన సివిల్ జడ్జి కాంచన్ కుమార్ తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు. దీంతో ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యల చుట్టూ నెలకొన్న వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
also read: ‘రామాయణ’ విజువల్ వండర్పై రాజమౌళి ప్రశంసలు.. రణ్బీర్, యశ్, సాయిపల్లవిపై ఆసక్తికర వ్యాఖ్యలు!
