HomeజాతీయంWoman Drinks Acid: నీళ్లనుకుని యాసిడ్ తాగిన యువతి.. ఒక్క గుక్కతో జీవితమే మారిపోయింది!

Woman Drinks Acid: నీళ్లనుకుని యాసిడ్ తాగిన యువతి.. ఒక్క గుక్కతో జీవితమే మారిపోయింది!

ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నీళ్లు అనుకుని పొరపాటున యాసిడ్ తాగిన ఓ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన హపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హపూర్‌కు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి అర్జున్ నగర్ ప్రాంతంలోని ఓ నగల దుకాణానికి వెళ్లింది. అక్కడ ఆమెకు దాహం వేయడంతో నీళ్లు ఇవ్వాలని షాపు యజమానిని కోరింది. దీంతో షాపులో పని చేసే వ్యక్తి వాటర్ బాటిల్ తీసుకురావడానికి బయటకు వెళ్లి కొద్దిసేపటి తర్వాత ఓ బాటిల్‌తో తిరిగి వచ్చాడు.

ఆ బాటిల్‌ను మహిళకు ఇవ్వగా, అందులో ఉన్న ద్రవాన్ని నీళ్లేనని భావించి ఒక గుక్క తాగింది. వెంటనే నోటిలో మంట మొదలవడంతో గట్టిగా అరుస్తూ, తాగిన ద్రవాన్ని బయటకు ఉమ్మేసింది. తర్వాత అది నీళ్లు కాదని, యాసిడ్ అని గుర్తించారు. మహిళ నోటిలో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యాసిడ్ బాటిల్ విక్రయించిన షాపు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే అతడి దుకాణం నుంచి మరికొన్ని యాసిడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నగల షాపు యజమాని స్పందిస్తూ.. తమకు తెలిసినంత వరకు ఆ బాటిల్ పూర్తిగా సీల్ చేసి ఉందని, ఫ్రిడ్జ్‌ లో నుంచి తీసి నేరుగా మహిళకు ఇచ్చామని తెలిపాడు. అసలు వాటర్ బాటిల్‌లో యాసిడ్ ఎలా వచ్చింది? దీనికి బాధ్యులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు