Homeజాతీయంమాస్క్ తో మంత్రి బస్సు ప్రయాణం... చిల్లర లేవన్నందుకు దిగిపోమన్న కండక్టర్.. ఆ తర్వాత ఏం...

మాస్క్ తో మంత్రి బస్సు ప్రయాణం… చిల్లర లేవన్నందుకు దిగిపోమన్న కండక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

ప్రజా రవాణా సేవల అసలు పరిస్థితి ఏంటో స్వయంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ చేసిన ఆకస్మిక తనిఖీ సంచలనంగా మారింది. ఎవరూ గుర్తుపట్టకుండా సాధారణ ప్రయాణికుడిలా మారి, ముఖానికి మాస్క్ ధరించి బెంగళూరులోని పలు బీఎంటీసీ బస్సుల్లో అర్ధరాత్రి వరకు ప్రయాణిస్తూ ఆయన ప్రజల ఇబ్బందులను దగ్గరగా గమనించారు.

ఈ పరిశీలనలో భాగంగా హెబ్బాల్ నుంచి నాగశెట్టిహళ్లి వెళ్లే బస్సులో ఎక్కిన మంత్రి, టికెట్ తీసుకునే సమయంలో ఆసక్తికర ఘటన ఎదురైంది. రెండు టికెట్లు ఇవ్వాలని కోరుతూ రూ.100 నోటు ఇచ్చినప్పటికీ, తన వద్ద చిల్లర లేదని చెప్పిన కండక్టర్ సరిపడా చిల్లర లేకపోతే బస్సు నుంచి దిగిపోవాలని సూచించాడు. మంత్రి అసలు ఎవరో తెలియక సాధారణ ప్రయాణికుడిగా భావించిన కండక్టర్ ఇలా ప్రవర్తించడం గమనార్హం. మంత్రి ఎలాంటి వాగ్వాదానికి దిగకుండా నిశ్శబ్దంగా బస్సు దిగిపోవడం విశేషం.

also read: తాడుతో… థార్‌కు కట్టి-  ఏటీఎం లాగేసి… డబ్బు దోచేసి…

అదే సమయంలో మరో నిర్లక్ష్య ఘటన కూడా ఆయన దృష్టికి వచ్చింది. ఒక బస్ స్టాప్ వద్ద ప్రయాణికుడు చేతి సంకేతం ఇచ్చినా డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడం చూసి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
బస్సులే కాకుండా ఆటో సేవలను కూడా మంత్రి పరిశీలించారు. నాగశెట్టిహళ్లి ప్రాంతంలో ఆటోలో ప్రయాణించిన ఆయనకు మీటర్‌లో రూ.30 చూపించినప్పటికీ డ్రైవర్ రూ.36 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై వివరణ కోరగా, మీటర్ సరిగా పనిచేయడం లేదని డ్రైవర్ చెప్పాడు. చివరకు మంత్రి రూ.40 చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన ఈ ఘటనల ఆధారంగా, ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించిన కండక్టర్‌పై, విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

also read: షాబాద్ ఆరుగురు హత్యల కేసు: నిందితుడి ఆచూకీ తెలిపితే రూ.2 లక్షల బహుమతి

తాజావార్తలు