క్రైమ్ మిర్రర్ : రాజస్థాన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన దివ్య మిట్టల్ గతంలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించారు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.2 కోట్లు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై 2023లో అవినీతి నిరోధక శాఖ (ACB) ఆమెను అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసును తాజాగా మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రకటించింది. ఈ వ్యవహారం 2021లో వెలుగులోకి వచ్చింది. జైపూర్, అజ్మీర్ ప్రాంతాల్లో జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అజ్మీర్ ఎస్‌ఓజీ దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో దివ్య మిట్టల్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. దర్యాప్తులో దాదాపు రూ.16 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి.
ఈ కేసులో హరిద్వార్‌కు చెందిన ఓ ఫార్మా సంస్థ యజమాని పేరు కూడా దర్యాప్తులోకి వచ్చింది. అతడిని కేసు నుంచి తప్పించేందుకు, అరెస్ట్ కాకుండా చూసేందుకు దివ్య మిట్టల్ భారీ మొత్తంలో డబ్బు అడిగారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సుమిత్ అనే కానిస్టేబుల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఏసీబీ పేర్కొంది. చివరకు రూ.50 లక్షలకు ఒప్పందం కుదిరిందని, అందులో తొలి విడతగా రూ.25 లక్షలు ఇవ్వాల్సి ఉందని దర్యాప్తులో తేలింది.
లంచం వ్యవహారానికి సంబంధించిన ఆడియో రికార్డులు ఏసీబీ అధికారుల వద్దకు చేరాయి. దివ్య మిట్టల్‌ను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ, ఆ విషయం ఆమెకు తెలియడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. అనంతరం ఆడియో ఆధారాలతో 2023 జనవరి 16న ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చిలో హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఏసీబీ దాదాపు 11,500 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే కేసును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైనంత బలమైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఏసీబీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో దివ్య మిట్టల్‌పై నమోదైన లంచం కేసును అధికారికంగా మూసివేస్తున్నట్లు ఏసీబీ తాజాగా వెల్లడించింది.
also read : దారుణం…భర్తను హత్య చేసిన భార్య…!
