క్రైమ్ మిర్రర్ : సమాజంలో ఉన్న అపోహలు, మూస ధోరణులకు భిన్నంగా ఓ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ప్రేమకు లింగభేదాలు అడ్డుకావని చాటుతూ తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఓ ఆలయ అర్చకుడు ట్రాన్స్‌జెండర్ మహిళను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. కడలూరుకు చెందిన ఆలయ అర్చకుడు నాగరాజన్, అదే ప్రాంతానికి చెందిన సంజనను వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో పాటు పలువురు ట్రాన్స్‌జెండర్లు కూడా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య వివాహ ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు నృత్యాలు చేస్తూ వేడుకను సందడిగా మార్చారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నో సామాజిక అడ్డంకులను అధిగమించి ఒక్కటైన జంటపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి నిర్ణయాన్ని అభినందిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సమాజంలో సమానత్వం, సానుకూల మార్పుకు ఈ వివాహం ఓ ఉదాహరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
also read : 150 లీటర్ల ఆవు కొవ్వు నూనె సీజ్
