పొలం పనులకు వెళ్లిన ఓ యువకుడిని పాము కాటేయడంతో విషాదం చోటుచేసుకుంది. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం చిన్నఅప్పన్నపాలెంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు పొలం పనులు చేస్తుండగా పాము కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే స్థానికంగా ఉన్న నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
అక్కడ నాటు వైద్యుడు పసరు మందు ఇచ్చి ఇంటికి పంపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తెల్లవారుజామున ప్రసాద్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. పాము కాటేసిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటు వైద్యుడి వద్ద చికిత్స చేయించడం వల్లే తమ కుటుంబ సభ్యుడి పరిస్థితి మరింత విషమించిందని ఆరోపిస్తున్నారు.
పాము కాటు ఘటనల్లో నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా, బాధితుడిని వీలైనంత త్వరగా సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
also read: లక్నో సమీపంలో భారీ డ్రగ్స్ పట్టివేత.. 18 కిలోల హెరాయిన్ స్వాధీనం
