తెలంగాణ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని శాసనసభ్యులకు వెల్లడించారు. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. అలాగే సభలో చర్చించాల్సిన అంశాలు, పూర్తి అజెండాపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
యువతకు రాజకీయాల్లో అవకాశం.. కీలక తీర్మానానికి సిద్ధం
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఓ కీలక తీర్మానం తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపి, పార్లమెంటులో సంబంధిత చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కోరే అవకాశం ఉంది. చట్టసభల్లో యువతకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష
అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశాలతో పాటు నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపైనా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
భూసేకరణలో జాప్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులు నిలిచిపోయే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణ, పునరావాసం, అటవీ శాఖ అనుమతులకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. పెండింగ్ పనులను గుర్తించి వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
