తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలో సిల్క్ గుడ్డ ముక్క కనిపించిందని ఓ భక్తుడు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆయన వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదంలో గుడ్డ ముక్క కనిపించడంతో సదరు భక్తుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ తయారీ, ప్యాకింగ్ ప్రక్రియలో సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు భక్తులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రసాదం నాణ్యత, తయారీ ప్రక్రియలో నిఘా, సిబ్బంది పనితీరుపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, గుడ్డ ముక్క లడ్డూలోకి ఎలా వచ్చిందనే అంశంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.
also read: కర్నూలులో పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు.. భారీగా బంగారం, నగదు చోరీ
