Homeక్రైమ్కర్నూలులో పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు.. భారీగా బంగారం, నగదు చోరీ

కర్నూలులో పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు.. భారీగా బంగారం, నగదు చోరీ

కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసు సిబ్బందికి చెందిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు. హెడ్ కానిస్టేబుల్ మహేష్, ఆర్‌ఎస్‌ఐ సుబ్బయ్య ఇళ్లలో ఒకే సమయంలో చోరీలు జరగడంతో స్థానికంగా కలకలం రేగింది.

తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించిన దుండగులు.. అదును చూసి లోపలికి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఇంట్లో సుమారు 23 తులాల బంగారం, 6 తులాల వెండి చోరీకి గురైనట్లు సమాచారం. అలాగే ఆర్‌ఎస్‌ఐ సుబ్బయ్య ఇంట్లో 5 తులాల బంగారం, 5 తులాల వెండి, రూ.30 వేల నగదు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది.

ఒకే ప్రాంతంలో పోలీసు అధికారుల ఇళ్లలో వరుసగా చోరీలు జరగడం స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ అనుమానితుల కదలికలను గుర్తించే పనిలో ఉన్నారు.

దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను త్వరలోనే గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వరుసగా చోరీలు జరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

also read: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యల కేసు- జగదీశ్వరరెడ్డిని మృతిపై అనుమానం.. సైనైడ్‌తో హత్య చేశారా?

తాజావార్తలు