తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ప్రారంభం కావాల్సిన ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక సమ్మెకు బ్రేక్ పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు జరిపిన చర్చలు సానుకూలంగా ముగియడంతో సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు ఊరట లభించింది.
ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్‌లను నిలిపివేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కార్మిక సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డ్రైవర్ల సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లపై చర్చించారు.
ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు కోరాయి. అలాగే ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, చాలాకాలంగా పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశాయి.
కార్మిక సంఘాల డిమాండ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి వచ్చిన హామీలతో సంతృప్తి చెందిన కార్మిక సంఘాల నేతలు నిరవధిక సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్‌లు సహా ప్రైవేట్ ప్రయాణ వాహనాల సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.
సమ్మె విరమణతో సోమవారం నుంచి రవాణా సమస్యలు ఎదురవుతాయన్న ఆందోళనకు తెరపడింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు, విద్యార్థులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
also read: ఎనిమిదేళ్లుగా దాచిన రూ.12 లక్షలు.. ఎలుకలు కొరికేశాయి! బంగారం కొనాలనుకున్న మహిళకు ఊహించని షాక్
