డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకున్న ఓ యువతి.. ఓ ఐటీ ఉద్యోగిని నగ్న వీడియోల పేరుతో బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి ‘హింజ్’ డేటింగ్ యాప్‌లో ‘ఇషా’ అనే యువతి పరిచయమైంది. కొంతకాలం ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. అనంతరం వీడియో కాల్స్‌లో మాట్లాడటం ప్రారంభించారు. ఈ క్రమంలో వీడియో కాల్ సందర్భంగా ఉద్యోగికి సంబంధించిన ప్రైవేట్ దృశ్యాలను యువతి రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
ఆ వీడియోలను చూపిస్తూ యువతి ఉద్యోగిని బెదిరించడం ప్రారంభించింది. డబ్బులు ఇవ్వకపోతే రికార్డ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో, ఇతరులకు పంపిస్తానంటూ ఒత్తిడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భయపడిన ఉద్యోగి పలు దఫాలుగా డబ్బులు చెల్లించాడు.
అయితే డబ్బులు చెల్లించినప్పటికీ యువతి వేధింపులు ఆపకుండా మరిన్ని డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇలా మొత్తం రూ.3.61 లక్షలు చెల్లించిన అనంతరం కూడా బెదిరింపులు కొనసాగడంతో బాధితుడు చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి.. యువతి ఉపయోగించిన ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
డేటింగ్ యాప్‌లలో పరిచయం లేని వ్యక్తులతో వీడియో కాల్స్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత లేదా ప్రైవేట్ దృశ్యాలను పంచుకోకపోవడం మంచిదని, ఎవరైనా ప్రైవేట్ వీడియోలతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే భయపడి చెల్లింపులు చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.
also read: సున్నితమైన పాత్రలకే నా ఓటు.. నటుడు సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు
