బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వదేశీ ఉత్పత్తుల పేరుతో రామ్‌దేవ్ చేస్తున్న ప్రచారంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. స్వదేశీ బ్రాండ్‌గా ప్రచారం చేస్తున్న ఉత్పత్తుల్లో నకిలీ, విదేశీ వస్తువులు కూడా ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ కళాశాల కార్యక్రమంలో బ్రిజ్ భూషణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో రామ్‌దేవ్ పనితీరు బాగానే ఉండేదని, అయితే ఇప్పుడు ఆయన వ్యవహారశైలి మారిపోయిందని విమర్శించారు.
రామ్‌దేవ్‌కు సంబంధించిన ఉత్పత్తులపై పరోక్షంగా ప్రస్తావిస్తూ.. విదేశీ వస్తువుల తయారీ, విక్రయాల విషయంలోనూ ఆయనపై బ్రిజ్ భూషణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో నకిలీ నెయ్యి విషయంలో తరచూ ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఈ అంశంపై రామ్‌దేవ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆరోపించారు.
ఇక భవిష్యత్తులో రామ్‌దేవ్ ఏదైనా ఉద్యమం చేపడితే, గతంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ ఈసారి ధైర్యంగా ముందుకు రావాలని బ్రిజ్ భూషణ్ సవాల్ చేశారు. గతంలో ఓ నిరసన సమయంలో రామ్‌దేవ్ మహిళా వేషధారణలో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటనను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
2022 నుంచి కొనసాగుతున్న వివాదం
బ్రిజ్ భూషణ్, బాబా రామ్‌దేవ్ మధ్య విభేదాలు కొత్తవి కావు. 2022లో గోండా జిల్లాలోని మహర్షి పతంజలి జన్మస్థలానికి పతంజలి సంస్థ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ బ్రిజ్ భూషణ్ విమర్శలు చేశారు. అంతేకాకుండా తమ సంస్థకు ‘పతంజలి’ అనే పేరును ఉపయోగించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఇరువురి మధ్య పలు సందర్భాల్లో మాటల యుద్ధం కొనసాగింది. తాజాగా బ్రిజ్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చాయి.
also read: బెంగళూరు రెస్టారెంట్లో కస్టమర్‌కు అవమానం.. బిల్లుపై ‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’!
