హర్యానాలోని కురుక్షేత్రలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ఛిద్రం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి యజమాని ఈ దృశ్యాన్ని గమనించడంతో భయపడిన మహిళ టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కురుక్షేత్రలోని పీహోవా రోడ్డులో రాజ్ ప్యాలెస్ సమీపంలో రాజేశ్, విమలా దేవి దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేశ్ ఓ వాటర్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇంటి నుంచి పెద్దగా అరుపులు వినిపించడంతో యజమాని రింకూ వారిని చూసేందుకు టెర్రస్‌పైకి వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రాజేశ్ రక్తపు మడుగులో పడి ఉండగా, విమలా అతని మృతదేహం వద్ద ఉండి అతని పొట్ట భాగంలో ఉన్న పేగులను తీసి ఓ సంచిలో పెడుతుండటం చూసినట్లు యజమాని పోలీసులకు తెలిపాడు.
తనను ఇంటి యజమాని గమనించినట్లు గుర్తించిన విమలా.. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో టెర్రస్‌పై నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో రాజేశ్ పొట్ట భాగంలో సుమారు 35 సెంటీమీటర్ల మేర లోతైన కోత ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. శరీరంలోని కొన్ని అవయవాల భాగాలు కనిపించకపోవడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. విమలా క్షుద్రపూజలు, చేతబడి వంటి కార్యకలాపాలకు పాల్పడేదని, ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని ఇంటి యజమాని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాలు దర్యాప్తులో అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ దంపతులకు పిల్లలు లేరని తెలుస్తోంది. ప్రస్తుతం విమలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. ఆమె కోలుకున్న తర్వాత ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా హత్యకు అసలు కారణం ఏమిటన్నది స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు దారితీసిన పరిస్థితులు, మృతదేహాన్ని ఛిద్రం చేయడానికి గల కారణాలు, దంపతుల మధ్య ఉన్న వివాదాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: క్షుద్రపూజలు, చేతబడి వంటి అంశాలపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం పోలీసులకు అందిన సమాచారంలో భాగం మాత్రమే. దర్యాప్తు పూర్తయ్యే వరకు వాటిని నిర్ధారిత వాస్తవాలుగా పరిగణించకూడదు.
also read: గచ్చిబౌలిలో డేటింగ్ యాప్ మోసం.. నగ్న వీడియోలతో బెదిరించి ఐటీ ఉద్యోగి నుంచి రూ.3.61 లక్షలు వసూలు
