విజయవాడలో సోషల్ మీడియా పరిచయం ఓ యువతిని భారీ ఆర్థిక మోసానికి గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న స్వర్ణ మాల్యకు స్నాప్‌చాట్ ద్వారా గౌతం నాయుడు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఈ పరిచయం సన్నిహితంగా మారినట్లు సమాచారం.
తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయానని గౌతం నాయుడు యువతిని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. అతడి మాటలను నమ్మిన స్వర్ణ మాల్య వివిధ సందర్భాల్లో విడతలవారీగా డబ్బులు అందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఆమె నుంచి రూ.1.50 కోట్లకు పైగా నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా నిందితుడు మరింత నగదు కోసం ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ యువతిని మానసికంగా బెదిరించినట్లు సమాచారం.
నిందితుడి వేధింపులు తీవ్రం కావడంతో బాధితురాలు చివరకు తాను మోసపోయినట్లు గుర్తించింది. తీవ్ర ఆందోళనకు గురైన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం లేదా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు.
also read: మాజీ ఎయిర్‌హోస్టెస్ డ్రగ్స్ దందా.. రూ.30 లక్షల మెఫెడ్రోన్‌తో పట్టుబడిన మహిళ
