క్రైమ్ మిర్రర్ : కర్ణాటక సరిహద్దులోని గుమ్మళాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుమ్మళాపురానికి చెందిన నారాయణస్వామి (39)కి విద్యతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా విద్య మరో వ్యక్తి పునీత్‌తో సన్నిహితంగా ఉంటున్న విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా నారాయణస్వామికి అప్పులు పెరగడంతో తన ఇంటిని రూ.22 లక్షలకు విక్రయించి అప్పులు తీర్చినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.5 లక్షలను భార్య బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం విద్య.. పునీత్‌తో కలిసి బెంగళూరు సమీపంలోని ఆనేకల్‌కు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న నారాయణస్వామి అక్కడికి వెళ్లి తిరిగి ఇంటికి రావాలని ఆమెను కోరినప్పటికీ, ఆమె అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.
సోమవారం విద్య డబ్బుల కోసం గుమ్మళాపురానికి వచ్చింది. ఆమెను చూసిన నారాయణస్వామి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని, మిగిలిన ఆస్తిని పిల్లల పేరున రాయాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం తీవ్రం కావడంతో విద్యను బ్యాంకు బయటకు తీసుకొచ్చిన నారాయణస్వామి.. బండరాయితో ఆమె తలపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా విద్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన నారాయణస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి మృతి చెందడం, తండ్రి అరెస్టవడంతో దంపతుల ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : పసికందులపై మృత్యు పంజా.. అగ్నిప్రమాదంలో నవజాత శిశువులు సజీవ దహనం
