Homeక్రైమ్అన్నకు చివరి రాఖీ.. కన్నీళ్లు పెట్టించిన చెల్లెలి వీడ్కోలు

అన్నకు చివరి రాఖీ.. కన్నీళ్లు పెట్టించిన చెల్లెలి వీడ్కోలు

క్రైమ్ మిర్రర్ : రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. ప్రతి చెల్లెలూ తన అన్న చేతికి రాఖీ కట్టి, అతడి ప్రేమాభిమానాలను పొందాలని కోరుకుంటుంది. కానీ విధి వక్రించడంతో ఓ చెల్లెలు తన అన్న చేతికి కాకుండా.. అతడి మృతదేహానికి చివరిసారిగా రాఖీ కట్టిన విషాద ఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన జమాల్‌పూర్ నవీన్ (24) బుధవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. చటాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలోని ఓ మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నవీన్ మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాఖీ పండుగ సమీపిస్తున్న సమయంలో అన్నను కోల్పోవడంతో అతడి చెల్లెలు పూజిత కన్నీరుమున్నీరుగా విలపించింది.

 మృతదేహానికి రాఖీ

ప్రతిసారీ ప్రేమగా అన్న చేతికి రాఖీ కట్టే పూజిత.. ఈసారి నిశ్చలంగా ఉన్న అన్న మృతదేహానికి చివరిసారిగా రాఖీ కట్టింది. అన్న ఇక తనకు రాఖీ కట్టించుకునేందుకు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆమె బోరున విలపించింది. మృతదేహానికి రాఖీ కడుతున్న సమయంలో పూజిత కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. సంతోషంగా జరుపుకోవాల్సిన రాఖీ పండుగకు ముందే నవీన్ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి చివరి రాఖీ ఓ కన్నీటి గుర్తుగా మిగిలిపోయింది.
also read : హైదరాబాద్‌లో కొత్త తరహా సైబర్ మోసం.. సెల్‌ఫోన్‌ చోరీ చేసి బ్యాంక్‌ ఖాతాలు ఖాళీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు