Homeక్రైమ్తాడుతో... థార్‌కు కట్టి-  ఏటీఎం లాగేసి... డబ్బు దోచేసి...

తాడుతో… థార్‌కు కట్టి-  ఏటీఎం లాగేసి… డబ్బు దోచేసి…

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అర్ధరాత్రి జరిగిన దొంగతనం ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొందరు దుండగులు థార్ వాహనాన్ని ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని లాగి డబ్బును దోచుకెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం, శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు థార్ వాహనంలో ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. ముందుగా ప్లాన్ చేసినట్టుగా వారు ఏటీఎం యంత్రానికి తాడు కట్టి వాహనంతో బలంగా లాగడంతో యంత్రం బయటకు వచ్చేసింది.

తర్వాత దాన్ని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి ఈడ్చుకెళ్లి, అక్కడ యంత్రాన్ని పగులగొట్టి అందులోని నగదును అపహరించారు. అనంతరం అదే వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎంలో ఎంత మొత్తం నగదు ఉన్నదో ఇంకా స్పష్టత రాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. ధ్వంసమైన ఏటీఎం భాగాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనలో ఉపయోగించిన థార్ వాహనం నంబర్‌ను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

also read: చట్టం చెప్పే ఖాకీ.. తానే ఉల్లంఘిస్తే? మైనర్‌తో డ్రైవింగ్ ఘటన వైరల్

తాజావార్తలు