క్రైం మిర్రర్ : స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో చోటుచేసుకుంది. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా, గ్రామాల్లోనూ శోకసంద్రం నెలకొంది.
కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. ఝరాసంగం మండలం కురుసంగం గ్రామానికి చెందిన గొల్ల ప్రశాంత్ (19), జోగిపేట ప్రాంతానికి చెందిన సతీష్ (17)తో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిసి ఆదివారం సాయంత్రం మల్కాపూర్ చెరువు వద్దకు వెళ్లారు. వేసవి తరహా వాతావరణం, సెలవు రోజు కావడంతో కొంతసేపు సరదాగా గడపాలని భావించిన వారు సాయంత్రం 4 గంటల సమయంలో చెరువులోకి ఈత కొట్టేందుకు దిగారు.
అయితే ఈతలో పూర్తి నైపుణ్యం లేకపోవడంతో ప్రశాంత్, సతీష్‌లు చెరువులో లోతైన ప్రాంతానికి వెళ్లి నీటిలో చిక్కుకున్నారు. వారిని గమనించిన స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో స్థానికులకు సమాచారం అందించగా, వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు.
మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. యువకుల మృతితో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్నేహితులతో కలిసి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు తిరిగి శవాలుగా రావడంతో స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సోమేశ్వరి తెలిపారు.
కాగా, మృతి చెందిన ప్రశాంత్, సతీష్ ఇద్దరూ సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాలలో బీజడ్‌సీ (B.Z.C) రెండో సంవత్సరం చదువుతున్నారు. చదువులో ముందుండే ఈ ఇద్దరు విద్యార్థులు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కళాశాలలో కూడా విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో చెరువులు, కాలువలు, జలాశయాల్లో ఈతకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
also read : అమెరికాలో భారతీయ మహిళ దారుణ హత్య.. భర్త కాల్పుల్లో గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మృతి