క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శనివారం విజయవంతంగా భుజం శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని తెలిపారు.వైద్యుల ప్రకారం, పవన్ కళ్యాణ్ కుడి భుజంలో రొటేటర్ కఫ్ గాయంతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉండటంతో శస్త్రచికిత్స అవసరమైంది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. అనంతరం ఆయనను రికవరీ రూమ్‌కు తరలించగా, ప్రస్తుతం అనస్థీషియా ప్రభావం నుంచి కోలుకుంటున్నారు.ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాలకూ రొటేటర్ కఫ్ గాయాలు తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఒకేసారి రెండు భుజాలకు శస్త్రచికిత్స చేస్తే కోలుకోవడం కష్టమవుతుందని సూచించడంతో ప్రస్తుతం కుడి భుజానికి మాత్రమే ఆపరేషన్ చేశారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు వెల్లడించారు.2016లో పవన్ కళ్యాణ్‌కు భుజానికి గాయం అయినప్పటికీ, ప్రజా కార్యక్రమాలు, రాజకీయ పర్యటనలు, ఎన్నికల ప్రచారం, వారాహి యాత్రలతో విశ్రాంతి లేకుండా కొనసాగారు. అభిమానులతో కరచాలనం చేయడం, చేతులు పట్టుకోవడం వంటి సందర్భాల్లో భుజాలపై మరింత ఒత్తిడి పడటంతో సమస్య తీవ్రమైంది. అయినప్పటికీ ఆయన తన బాధను పక్కన పెట్టి ప్రజా సేవ కొనసాగించారని పార్టీ పేర్కొంది.
సునీల్‌తో బంధంపై ఎస్తేర్ రియాక్షన్.. అసలు విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్
ఈ ఏడాది ముక్కుకు శస్త్రచికిత్స కోసం నిర్వహించిన వైద్య పరీక్షల్లో భుజాల్లో కండరాల చీలికలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇంత తీవ్రమైన గాయాలతో ఇన్నేళ్లుగా విధులు నిర్వహించడం ఆశ్చర్యకరమని వైద్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. అనంతరం ముంబయిలో మరిన్ని పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స తేదీని ఖరారు చేశారు.శస్త్రచికిత్స విజయవంతం కావడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. జనసేన పార్టీ కూడా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపింది.వైద్యుల వివరాల ప్రకారం, రొటేటర్ కఫ్ అనేది భుజం సులభంగా కదలడానికి సహాయపడే కండరాలు, స్నాయువుల సముదాయం. ఈ భాగంలో గాయం జరిగితే చేతిని పైకెత్తడం కష్టమవడం, తీవ్రమైన నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రముఖ తమిళ హీరోపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు.. రూ.1.80 కోట్ల అద్దె బకాయిల వివాదం