క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో చాటిచెప్పేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు ఒక ప్రత్యేక ఆకర్షణ తోడవనుంది. ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ సమ్మిట్ కోసం ఒక ప్రత్యేక గీతాన్ని స్వరపరుస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రగతి, పారిశ్రామిక వృద్ధి, సంస్కృతి మరియు భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచానికి ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునే విధంగా ఈ పాటను తెలుగుతో పాటు మరో మూడు ప్రధాన భాషల్లో (మొత్తం 4 భాషల్లో) విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కీరవాణి తన అద్భుతమైన సంగీతంతో ఈ గీతానికి ప్రాణం పోస్తున్నారని, ఇది సమ్మిట్‌కు ఒక ఐకానిక్ థీమ్ సాంగ్‌గా నిలుస్తుందని సంజయ్ జాజు పేర్కొన్నారు.
నిత్యావసరాల ధరలకు కళ్లెం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
కేవలం పెట్టుబడుల చర్చలకే పరిమితం కాకుండా, తెలంగాణ కళా వైభవాన్ని చాటిచెప్పేలా సమ్మిట్ ప్రాంగణంలో భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో అతిథులకు ఘనస్వాగతం పలకనున్నారు.దీంతో పాటు, సదస్సుకు విచ్చేసే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ రుచులను పరిచయం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మిట్ ప్రాంగణంలో దాదాపు 30 ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి, వాటిలో తెలంగాణ సంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రావడమే కాకుండా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
