క్రైమ్ మిర్రర్,సినిమా:- ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి చాలా కాలం తర్వాత స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఆపరేషన్ అరుణా రెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధం, గతంలో జరిగిన రాజకీయ విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పోసాని మాట్లాడుతూ… వ్యక్తిగతంగా తాను ఎవరి నాశనాన్ని కోరుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దూరంగా ఉండటమే తప్ప, ఎవరికైనా హాని చేయాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాదన్నారు. గతంలో తనను తీవ్రంగా విమర్శించిన వారికి కూడా అవసరమైన సమయంలో ఆర్థికంగా, వ్యక్తిగతంగా సహాయం చేశానని చెప్పారు. నన్ను తిట్టిన వాళ్ల ఇంట్లో భోజనం చేసే టేబుల్ కూడా లేకపోతే నా ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ పంపించాను. నాకు చేతనైనంత సహాయం చేశాను. అలాంటి మనస్తత్వమే నాది అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై కూడా పోసాని ప్రశంసలు కురిపించారు. చిరంజీవి ఎవరి ద్వేషాన్ని కోరుకునే వ్యక్తి కాదు. ఆయన తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా పలకరిస్తారు. నేను చూసినంత వరకు ఎవరినీ అవమానించి పంపిన సందర్భం లేదు. ఆయన చాలా ఫ్రెండ్లీగా, క్లియర్‌గా ఉండే వ్యక్తి. ఆయన నాకేమీ అన్యాయం చేయలేదు. అందుకే ఆయనపై నాకు ఇప్పటికీ గౌరవం అలాగే ఉంది అని తెలిపారు.
Pawan Kalyan Health Update: ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
అయితే, రాజకీయాల విషయానికి వస్తే గతంలో తాను చేసిన వ్యాఖ్యలు అప్పటి పరిస్థితులకు సంబంధించినవేనని పరోక్షంగా వెల్లడించారు. పోసాని ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.2024 ఎన్నికలకు ముందు జనసేనకు చిరంజీవి మద్దతు ప్రకటించిన సమయంలో పోసాని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, రాజకీయాల్లో స్థిరంగా కొనసాగకపోవడంపై ఆయన అప్పట్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ పరిశ్రమలో కూడా చర్చనీయాంశమయ్యాయి.అయితే తాజా ఇంటర్వ్యూలో మాత్రం చిరంజీవి వ్యక్తిత్వంపై సానుకూలంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ విభేదాలు వేరు, వ్యక్తిగత గౌరవం వేరు అనే భావనతో ఆయన మాట్లాడినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో పోసాని తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానుల్లోనూ చర్చకు దారితీశాయి.