Homeఅంతర్జాతీయంStrait of Hormuz:హోర్ముజ్ జలసంధి చుట్టూ హైటెన్షన్.. చమురు రవాణాపై ఆందోళన!

Strait of Hormuz:హోర్ముజ్ జలసంధి చుట్టూ హైటెన్షన్.. చమురు రవాణాపై ఆందోళన!

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత పెరిగింది. ఈ జలసంధిని తాము మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటించగా, అమెరికా మాత్రం ఆ వాదనను పూర్తిగా ఖండించింది. ఒక వాణిజ్య నౌక నిర్ణయించిన మార్గాన్ని వదిలి మరో మార్గంలో ప్రయాణించడంతో హెచ్చరిక కాల్పులు జరిపామని, అనంతరం హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామం జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా దళాలు ఇరాన్‌పై కొత్త సైనిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ ప్రకటనను తిరస్కరించింది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలమార్గమని, అది ఇరాన్ నియంత్రణలో లేదని స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ప్రయాణించే అన్ని నౌకలకు ఈ మార్గం తెరిచే ఉందని, ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఏడు రోజుల్లో 140కి పైగా వాణిజ్య నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. అలాగే గత రెండు నెలల్లో అమెరికా భద్రతా ఏర్పాట్ల మధ్య 800కు పైగా నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగించాయని తెలిపింది. వీటి ద్వారా దాదాపు 400 మిలియన్ బారెళ్లకు పైగా ముడి చమురు ప్రపంచ దేశాలకు చేరినట్లు పేర్కొంది.

మరోవైపు అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ ప్రాంతంలో అమెరికా సైనిక దళాల కదలికలు అక్రమమని ఆరోపించింది. ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి ప్రశాంతత నెలకొన్న తర్వాతే నౌకల ప్రయాణాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై అమెరికా, ఇరాన్ భిన్న ప్రకటనలు చేయడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు