HomeజాతీయంManmohan Singh: మన్మోహన్ సింగ్ ఆత్మహత్య చేసుకుంటానన్నారా? మాజీ సీఈసీ షాకింగ్ కామెంట్స్!

Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఆత్మహత్య చేసుకుంటానన్నారా? మాజీ సీఈసీ షాకింగ్ కామెంట్స్!

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన ఓ భావోద్వేగ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎస్.వై. ఖురేషీ తన కొత్త పుస్తకం ‘ఇండియా అండ్ ఐ.. ఎ హండ్రెడ్ మెమొరీస్, నాట్ ఎ మెమోయిర్’ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా, అప్పటి కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ముస్లింలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 4.5 శాతం నుంచి 9 శాతానికి పెంచుతామని ప్రకటించారు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో, విచారణ అనంతరం ఎన్నికల సంఘం సల్మాన్ ఖుర్షీద్‌ను తీవ్రంగా మందలించింది.

ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘంపై పరోక్ష విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారం ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని భావించిన ఖురేషీ, అప్పటి ప్రధానమంత్రి ప్రెస్ సెక్రటరీ హరీష్ ఖారేకు తన ఆందోళనను వివరించారు. ఈ విషయం ప్రధానికి తెలియజేయడంతో, మరుసటి రోజే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఖురేషీకి అత్యవసర ఫోన్ వచ్చింది.

మన్మోహన్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి వెంటనే కలవాలని కోరారు. అదే సాయంత్రం ప్రధానమంత్రి నివాసంలో ఇద్దరూ సమావేశమయ్యారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ఎంతో భావోద్వేగానికి గురై, “నువ్వు కూడా నా గురించి అలా అనుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను” అని అన్నట్లు ఖురేషీ తన పుస్తకంలో పేర్కొన్నారు. దీంతో ఖురేషీ ఆశ్చర్యానికి గురయ్యారు. తాను ప్రధానమంత్రిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం కొందరు మంత్రుల ప్రవర్తన గురించే తన అసంతృప్తిని వ్యక్తం చేశానని వివరించారు. అనంతరం మన్మోహన్ సింగ్ స్పందిస్తూ, ఈ విషయం తనకు తెలియదని, తెలిసి ఉంటే సంబంధిత మంత్రులను తప్పకుండా మందలించేవాడినని చెప్పారు. ఇకపై ఇలాంటి సమస్యలు ఎదురైతే నేరుగా తనకే ఫోన్ చేయాలని కూడా సూచించినట్లు ఖురేషీ వెల్లడించారు. ఈ సమావేశం తర్వాత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేతల విమర్శలు పూర్తిగా ఆగిపోయాయని మాజీ సీఈసీ తన పుస్తకంలో పేర్కొన్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు